Lakshmi’s NTR Rating & Review | Ram Gopal Varma’s Epic Masterpiece | Cinimonk.in

March 29, 2019
168 Views
మహానటుడు మహానాయకుడు ఎన్టీఆర్‌ పై మరో  బయోగ్రాఫికల్‌ మూవీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ బయోపిక్  ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రిలీజ్‌పై స్టే విధించటంతో విడుదల నిలిపివేయగా తెలంగాణేతర ప్రాంతాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వర్మ చెప్పినట్టుగా నిజంగా నిజాలనే మాత్రమే  తెరకెక్కించాడా..? ఎన్టీఆర్‌ చివరి  అసలైన బయోపిక్‌ ఈ సినిమానేనా..? ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం.
కథ;
కథ అనే కంటే జరిగిన కథగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కొత్త కథేం కాదు, తెలుగు ప్రజలందరికి తెలిసిన కథే. 1989లో ఎన్టీఆర్‌ (విజయ్ కుమార్‌) అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్‌ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతికి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి గురించి కొద్ది రోజుల్లొనే ఎన్టీఆర్‌ తన జీవితంలోకి పెళ్లితో ఆహ్వానిస్తాడు. ఈ నేపథ్యంలోనే వారి ఇరువురి మీద  దుష్ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం ఎన్టీఆర్‌ దాకా రావటంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్‌లో పబ్లిక్ గా  లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్‌ ప్రకటిస్తాడు. ఎన్టీఆర్‌ అల్లుడైన బాబు రావ్‌ (శ్రీతేజ్) ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ మళ్ళి భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న బాబు రావు కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను మభ్యపెట్టి, ఎంయల్యేలను తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌పై వైస్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులు వేయటంతో మరింత  కుమిలి పోతాడు. ౧౯౯౬ జనవరి ౧౮న ఎన్టీఆర్‌ మరణంతో శుభం కార్డు పడుతుంది  ఇదే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కథ.
నటీనటులు :
ఈ సినిమా కోసం వర్మ ఎంచుకున్న ప్రధాన పాత్రదారులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ముఖ్యంగా ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించిన పి. విజయ్ కుమార్‌ అయితే సినీరంగానికే కొత్త. రంగస్థల నటుడిగా ఉన్న విజయ్‌ కుమార్‌ను ఎన్టీఆర్‌ లాంటి పాత్రకు ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే వర్మ తన మీద పెట్టుకున్న నమ్మకానికి విజయ్‌ కుమార్‌ పూర్తి న్యాయం చేశాడు. ఎన్టీఆర్‌ హావభావాలను,   డబ్బింగ్ చూపించిన డైలాగ్ డెలివరినీ చాలా బాగా తెర మీద చూపించాడు. మరో కీలక పాత్రలో నటించిన యజ్ఞశెట్టి నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. నిష్కల్మశమైన ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం ఇలా అన్ని భావాలను తెరమీద అద్భుతంగా పలికించారు యజ్ఞ శెట్టి . బాబు రావు పాత్రలో  శ్రీతేజ్ జీవించాడనే చెప్పాలి. కుళ్లు, కుతంత్రం, వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా శ్రీ తేజ్‌ నటన ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తంగా ప్రేక్షకుడికి గుర్తుండిపోయే పాత్ర ఇది.  ఇతర పాత్రలో అంతా కొత్తవారే కనిపించిన ఎవరికి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
ముందు నుంచి చెపుతున్నట్టుగా వర్మ డైనమిక్ గా  ఈ సినిమాలో అసలు నిజాలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్‌ అనే మహానాయకుడు ఎలా ఒంటరి వాడయ్యాడు.? ఆ సమయంలో లక్ష్మీకి ఎలా దగ్గరయ్యాడు.? వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్‌ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది.? ఆ కుట్రల వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు? చివరకు ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అన్న విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. వర్మ మార్క్‌ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని చెప్పాలి.సినిమాకు మరో ప్లస్‌ పాయింట్ కల్యాణీ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ సన్నివేశాల స్థాయిని పెంచాడు కల్యాణీ మాలిక్‌. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో సంగీతం సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
విశ్లేషణ :
ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా కాస్త కథనం నెమ్మదించినట్టుగా అనిపించినా ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్‌ అయ్యాడు. ప్రతీ నటుడు తన పాత్రలో లీనమై సహజంగా నటించాడు. అయితే కొన్ని చోట్ల ఎమోషనల్ గా సాగుతూ అక్కడక్కడ పర్వాలేదనిపిస్తోంది. అయితే సినిమాలో కొన్ని సీన్స్ ను ఎమోషనల్ గా నడిపిన దర్శకులు, ముఖ్యంగా ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, అప్పటి పరిస్థితులను చాలా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకులు విఫలం అయ్యారు.రామారావు, లక్ష్మీపార్వతి మినహా ఎవరికీ అసలు పేర్లు పెట్టకపోయినా, వారిని ఎక్కడా పిలవకపోయినా చూడగానే వీరు ఫలానా అని గుర్తించేలా వారి వేష భాషలపై వర్మ తీసుకున్న శ్రద్ధ మాత్రం మెచ్చుకోతగింది.చివర్లో వచ్చే మోతాదు మించిన మెలోడ్రామాని కానీ భరించడం చాలా కష్టం. ఉన్నట్టుండి ఏడు పదుల వయసున్న ఎన్టీఆర్‌ తన భార్య లక్ష్మీపార్వతితో డాన్స్‌ చేసే సీన్‌ చూస్తే వర్మ ఈ చిత్రాన్ని ఆయనపై అభిమానంతో తీసాడా లేక ఆయన అభిమానులపై విరోధంతో తీసాడా అనిపిస్తుంది. ఏది ఏమైనా విడుదలకు ముందు ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువైన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌
తెలుగు దేశం పార్టీ అభిమానులకు రుచించకపోయిన సగటు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశించవచ్చు .
Facebook Comments

Like Us

Inline
Inline